చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి చికిత్సనిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 ఆంధ్రప్రదేశ్‌ లోని  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మైదాబత్తుల విజయకుమారి(60) క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రికి కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలుదేరారు. 

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్దకు వీరు ప్రయాణిస్తున్న కారు చేరుకోగానే  హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై  ప్రమాదం జరిగింది. ఈ కారుకు ముందు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో వెనుకే  వస్తున్న కారు అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో విజయకుమారితోపాటు ఆమె భర్త సత్యానందం(70), కుమారుడు జాన్‌ జోసెఫ్‌(35) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ విజయవాడకు చెందిన అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.