Munugode Bypoll 2022 పై కాంగ్రెస్ ఫోకస్ : నేడు హైద్రాబాద్ కు మాణికం ఠాగూర్
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.
హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది., కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో ఠాగూర్ చర్చించనున్నారు.
మాణికం ఠాగూర్ రావడానికి ముందే ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు మునుగోడు ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు . ఈ నెల 5వ తేదీన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ఈ నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను అందించారు . ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలంగాణ స్పీకర్ కార్యాలయం సమచారం పంపింది. దీంతో ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వాదం విన్పించిన తొలి తరం నేతల్లో ఒకరు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణం తర్వాత ఆయన కూతురు స్రవంతి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే గత ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుండి పాల్వాయి స్రవంతి టికెట్ ను ఆశిస్తున్నారు. స్రవంతితో పాటు కృష్ణారెడ్డి కూడా ఈ స్థానం నుండి టికెట్ ను ఆశిస్తున్నారు.
ఈ స్థానంలో రాజకీయ పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ పరిస్థితి ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే విషయమై ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ కు చేరుకుంటారు. ఇవాళ సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో మాణికం ఠాగూర్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ నేతలతో కూడా ఠాగూర్ చర్చించనున్నారు.
2014లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 21న చౌటుప్పల్ లో నిర్వహించే సభలో రాజగోపాాల్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
మునుగోడులో తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలుు చేస్తుంది. మరో వైపు ఈ స్థానంలో విజయం సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు కూడా కసరత్తు చేస్తున్నాయి.
రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలియగానే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఊహించిన టీఆర్ఎస్ ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఘట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కీలక అధికారుల బదిలీలను ప్రభుత్వం చేసింది.