తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ.. రెండు నెలల కిందటే జీవో జారీ చేసిన సర్కార్..!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

Telangana withdraw general consent to CBI according to Reports

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన తెలంగాణ హోం శాఖ  జీవో నెంబర్ 51 జారీ చేసింది. తద్వారా గతంలో సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంది. గతంలో సీబీఐ ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెకక్కి తీసుకుంది. తెలంగాణలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అధికార టిఆర్ఎస్ చేత బీజేపీని ఇరికించాలని, ప్రతిష్టను దెబ్బతీయాలనే ఏకైక ఉద్దేశ్యంతో"సైబరాబాద్ కమిషనరేట్‌లోని మొయినాబాద్ పోలీసులు జారీ చేసిన ఎఫ్‌ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత, అన్యాయమైన దర్యాప్తును చేపట్టిందని పిటిషనర్ ఆరోపించారు.

అయితే ఈ పిటిషన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు.. జీవో నెంబర్ 51 విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక, మెయినాబాద్ ఫామ్ కేసులో విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.  

ఇదిలా ఉంటే.. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు సందర్భాల్లో కోరిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ సీబీఐతో సహా అన్ని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ రెండు నెలల క్రితమే సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఇ) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి ఆయా ప్రభుత్వాల సమ్మతి అవసరం. సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే.. ఆయా రాష్ట్రాల పరిధిలో కేసు నమోదు చేయడానికి సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. ఇక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా పలు రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు ఇప్పటికే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios