హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు సాధారణం నుండి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాలు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా వుండనుందో ప్రకటించింది వాతావరణ కేంద్రం. 

తూర్పు- పశ్చిమ తీరం వెంబడి శియర్ జోన్  3.1 కిమీ నుండి 5.8కిమీ ఎత్తు మధ్య ఏర్పడిందని... ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉందని వెల్లడించారు.  ఉత్తర ఇంటీరియర్  కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ  శియర్ జోన్ తో విలీనం అయ్యిందని తెలిపారు. ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5కిమి నుండి 7.6కిమి ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని వెల్లడించారు. 

దీని ప్రభావంతో బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉందన్నారు.  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి  కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 

బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం–ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ మరియు వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.