ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడతగా ఇవాళ తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రాజస్థాన్ కంటే తెలంగాణ ముందంజలో ఉంది. ఈసీ అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి మద్యాహ్నం 1గంట వరకు తెలంగాణ లో 49.15 శాతం ఓటింగ్ నమోదవగా
రాజస్థాన్ లో మాత్రం 41.53 శాతం నమోదయ్యింది. 

ఈ ఉదయం 7 గంటలకు ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల  కల్లా తెలంగాణలో 17 శాతం ఓట్లు పోలవగా రాజస్థాన్ లో మాత్రం 21.89 శాతం పోలింగ్  నమోదయ్యింది. అయితే మధ్యాహ్నానికి ఈ పోలింగ్ శాతాలు రివర్సయ్యాయి. మద్యాహ్నం నుండి తెలంగాణలో ఓటింగ్ శాతం పుంజుకోగా రాజస్థాన్ లో కొంత నెమ్మదించింది. దీంతో తెలంగాణ 49.15 శాతానికి చేరుకోగా, రాజస్ధాన్ కు 41.53 శాతానికి మాత్రమే చేరుకుంది.

అయితే రెండు రాష్ట్రాల్లోను ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండటంతో ఈ పరిణామం తమకే లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్, రాజస్థాన్ లో బిజెపి పార్టీల వ్యతిరేక ఓట్ల వల్లే పోలింగ్ శాతం పెరుగుతోందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.