model villages: తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశవ్యాప్తంగా తన సత్తాను చాటింది. దేశంలో ఉన్న ఆదర్శగ్రామాల్లో టాప్-10 తెలంగాణలోనే ఉన్నాయి. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్‌సైట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.
top ten model villages in india : దేశవ్యాప్తంగా మరోసారి తెలంగాణ తన సత్తాను చాటింది. దేశం మొత్తంగా పరిగణలోకి తీసుకున్న ఆదర్శగ్రామాల జాబితాలో తెలంగాణ నుంచి పది గ్రామాలు టాప్-10 లో ఉన్నాయి. అలాగే, దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో19 గ్రామాలు తెలంగాణకు చెందినవే కావడం మరో విశేషం. ఈ వివరాలను కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కాగా, సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాలు, దేశంలోని ఏవైనా గ్రామాలు ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేందుకు తీసుకువచ్చారు. SAGY కింద పార్లమెంట్ సభ్యులు ఎంపిక చేసుకున్న గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది.
ఈ సంవత్సరం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించిన సమాధానం ప్రకారం.. SAGY కింద 2697 గ్రామాలను ఎంపీలు దత్తత తీసుకున్నారు. SAGY లక్ష్యాలకు అనుగుణంగా వివిధ స్థాయిలలో ఉన్న 508 గ్రామాలలో.. తెలంగాణలో 74 గ్రామాలు లేదా దాదాపు 14.5% గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛ, ఈ పంచాయతీ, ఈ ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) లాంటి అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి.. ఆవార్డులు అందుకున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు.. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ పంచాయతీల రూపును మారుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు పేర్కొంటున్నారు.
దేశంలోని టాప్ 10 ఆదర్శ గ్రామాలు, వాటి స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి..
1. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి - స్కోర్: 92.17
2. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ - స్కోర్: 91.7
3. నిజామాబాద్ జిల్లా పల్డా - స్కోర్: 90.95
4. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ - స్కోర్:90.94
5. యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక - స్కోర్: 90.57
6. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మాల - స్కోర్: 90.49
7. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ - స్కోర్:90.47
8. నిజామాబాద్ జిల్లా తానాకుర్దు - స్కోర్:90.3
9. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్‌నూర్ - స్కోర్: 90.28
10. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి - స్కోర్: 90.25
ఆదర్శ గ్రామాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ఈ శాఖను చూస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అభినందనలు తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన ఘనతేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రీట్వీట్ చేశారు.
