హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడంతో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆ రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీపి) హోదాలో ఉన్న బి. మల్లారెడ్డి తెలంగాణ నుంచి డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. జగన్ వద్ద పనిచేయాలనేది ఆయన కోరిక. 

1998 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన మల్లారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి విశ్వాసపాత్రుడు. ఆయన 2008లో కడప జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన వైఎస్ కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. 

అయితే, తెలంగాణ ప్రభుత్వం మల్లారెడ్డికి అనుమతి ఇస్తుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్‌ల విషయంలో దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన ఐపీఎస్‌లలో పలువురు రిటైర్‌ అయ్యారు.

తెలంగాణ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పౌర సరఫరాల కమిషనర్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) డైరెక్టర్‌ సంతోశ్‌ మెహ్రాలు ఉన్నారని సమాచారం.