హైదరాబాద్: 8 ఏళ్ల క్రితం  కుటుంబం నుండి తప్పిపోయిన బాలుడిని పేస్‌బుక్  తమ  కుటుంబసభ్యుల వద్దకు చేర్చింది. రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడ ఈ యువకుడి ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 

బీహార్ రాష్ట్రానికి చెందిన రైతు ఆమోద్ ఝా‌ కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. నాలుగో వాడైన సుజీత్ కుమార్ ఝా ను నగరంలోని మౌలాలి ఉండే అక్కా బావల వద్ద ఉంచాడు. 

అయితే సుజీత్ కుమార్ కు  చదువుపై ఇంట్రెస్ట్ లేదు. దీంతో అక్కా బావలకు చెప్పకుండానే  2011 జనవరి 31 వతేదీన ఇంటి నుండి వెళ్లిపోయాడు.  అయితే  సుజీత్ కుమార్ అక్కా బావలతో పాటు కుటుంబసభ్యులు సుజీత్ కుమార్  కోసం  ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. 

దీంతో  అప్పట్లోనే మల్కాజిగిరి పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ సుజీత్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు.అయితే సుజీత్ కుమార్  కోసం అతడి బావ అజిత్ కుమార్  ఫేస్‌బుక్ లో కూడ  వెతికాడు.

అయితే  సుజీత్ కుమార్ పోలీకలు ఉన్న ఓ వ్యక్తికి ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు, అయితే అజిత్ కుమార్ ప్రెండ్ రిక్వెస్ట్ ను సుజీత్ కుమార్ తిరస్కరించాడు.  అంతేకాదు తన సమాచారం తెలిసిపోతోందనే ఉద్దేశ్యంతో సుజీత్ కుమార్ మరో పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేశాడు. 

దీంతో  అజిత్ కుమార్ మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. మల్కాజిగిరి పోలీసులు ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో ఫేస్‌బుక్ ప్రోఫైల్ ద్వారా ఐపీ అడ్రస్‌లను సంపాదించారు.  తద్వారా ఫోన్ నెంబర్ ఆధారంగా  ముంబై రెడ్‌లైట్ ఏరియాలో సుజీత్ ఉన్నట్టు గుర్తించారు. 

ముంబైలోని మాజగావ్ ప్రాంతంలో విజయ్ శిర్క అనే క్యాటరింగ్ కాంట్రాక్టర్ వద్ద సుజీత్ కుమార్ పనిచేస్తున్నాడు. అతడిని హైద్రాబాద్ కు తీసుకొచ్చారు. 8 ఏళ్ల క్రితం తప్పిపోయిన సుజీత్ కుమార్ ముంబైలో దొరకడంతో ఆ కుటుంబసభ్యుల్లో ఆనందానికి అంతు లేకుండాపోయింది.