టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల నియామకానికి ముందు టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET‌) నిర్వహణకు సెకండరీ స్యూల్​ ఎడ్యుకేషన్​కు రాష్ట్ర సర్కార్​ అనుమతిచ్చింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. మరోవైపు టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల నియామకానికి ముందు టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET‌) నిర్వహణకు సెకండరీ స్యూల్​ ఎడ్యుకేషన్​కు రాష్ట్ర సర్కార్​ అనుమతిచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్​ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

అంతేకాకుండా టెట్ అర్హతల్లో ప్రభుత్వం మార్పు చేసింది. 2015 డిసెంబర్ 23న టెట్‌కు సంబంధించి జారీచేసిన జీవో 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 8 ఇచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఆదేశాల మేరకు ఈ మార్పులు చేశారు. ఎన్‌‌సీటీఈ మార్గదర్శకాల మేరకు టెట్‌‌ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించారు. టెట్ అర్హత జీవితకాలం వర్తించేలా మార్గదర్శకాలు జారీచేశారు. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ మార్పు వర్తిస్తుంది. అప్పటి నుంచి నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో అర్హత సాధించినవారి సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ పొందాయి. 

మరోవైపు ఈ సారి టెట్ పేపర్‌‌ 1కు బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 నుంచి 10 తరగతులకు బోధించేందుకు అర్హులు. అందుకు టెట్‌లో పేపర్-2 రాస్తే సరిపోయేది. అయితే ఇక నుంచి బీఈడీ చేసిన అభ్యర్థులు.. 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత పొందనున్నారు. ఇందుకోసం బీఈడీ అభ్యర్థులు టెట్‌లో పేపర్ -1 రాయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఉద్యోగాల్లో చేరిన బీఈడీ అభ్యర్థులు రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇక, డీఈడీ అభ్యర్థులు మాత్రం.. కేవలం టెట్‌లో పేపర్-1 రాసేందుకు అర్హులు. 

ఇక, త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. మే నెలలో టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016 మే, 2017 జూలైలలో టెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.