మునుగోడు బైపోల్ 2022: పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.ఈ విషయమై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇవాళ ఈ మేరకు ప్రకటన చేశారు.
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుండి పోటీ చేయాలని టీడీపీ నాయకత్వం భావించినట్టుగా ఆపార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఏపార్టీకి కూడా మద్దతు ఇవ్వవద్దని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించారు.
గత వారంలో టీడీపీకి చెందిన నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారుమునుగోడు ఉప ఎన్నిక విషయమై చర్చించారు. అయితే ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 2004 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా చిలువేరు కాశీనాథ్ పోటీ చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కాశీనాథ్ గణనీయమైన ఓట్లను సాధించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. ఈ నెల 15వ తేదీన హైద్రాబాద్ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన జక్కలి అయిలయ్య యాదవ్ ను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని భావించారు. అయిలయ్య యాదవ్ సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఓ గ్రామానికి గతంలో సర్పంచ్ గా పనిచేశాడు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయిలయ్య యాదవ్ కొనసాగుతున్నాడు. అయితే ఇవాళ జక్కలి అయిలయ్య యాదవ్ పేరును ప్రకటించాలని భావించారు. కానీ చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.