హైదరాబాద్: తెలంగాణలో ఖాళీ అయిన రెండు పట్టభద్రులు కోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలయి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించగా తెలుగుదేశం పార్టీ కాస్త ఆలస్యంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు ఎల్.రమణ బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఎల్.రమణ నామినేషన్ కు కూడా ముహూర్తం ఖరారయ్యింది. 

''ప్రియమైన తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులకు , సీనియర్ నాయకులకు , నాయకురాళ్లకు , కార్యకర్తలకు మరియు అభిమానులకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు ఎల్.రమణ (మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు) హైదరాబాద్ , రంగారెడ్డి , మెహబూబ్ నగర్ పట్టబద్రుల ఎంఎల్సీ స్థానానికి శాసనమండలి అభ్యర్థిగా ఈ నెల 23వ తేది మంగళవారం ఉదయం 11 గంటలకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హిమాయత్ నగర్ నుండి బయలుదేరి జి.హెచ్.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్న దృష్ట్యా తెదేపా వివిధ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్రనాయకులు, నగరనాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము'' అంటూ  తెలంగాణ టిడిపి ఓ ప్రకటన విడుదలచేసింది.  

ఇక ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో ఫోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నుండి నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్ధిగా రాములు నాయక్... హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్ధిగా చిన్నారెడ్డి బరిలో దిగనున్నారు. ఇక బిజెపి తరపున నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్ధిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్ రావు బరిలో నిలిచారు.  ఈ మేర‌కు వీరిద్ద‌రి పేర్ల‌ను బీజేపీ నాయ‌క‌త్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. 

మరోవైపు అధికార టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ  ఎన్నికలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.