మాట్రిమోనీ సైట్ లో ఓ యువతికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, డబ్బులు లాగిన ప్రబుద్ధుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఏసీపీ హరినాథ్ వెల్లడించారు. 

నిందితుడు ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన బానోతు సాయినాథ్ (20) ఫిజియోథెరపీ కోర్సు చేస్తున్నాడు. మాట్రిమోనీ సైట్లలో వరుడి కోసం వెతుకుతున్న యువతుల సమాచారాన్ని సేకరించి ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా మాటలు కలిపేవాడు. 

తప్పుడు పేరు, చిరునామా, ఫోటోలతో మోసం చేసి వారి నుించి డబ్బులు లాగేవాడు. ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలించారు. దాంతో తన మకాంను హాస్టళ్లకి మార్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని మలేసియాలో ఉద్యోగం చేస్తున్న కాప్రాకు చెందిన ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరును మోసం చేశాడు. 

ఓ మాట్రిమోనీ సైట్ నుంచి ఆ లేడీ టెక్కీ నెంబర్ తీసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఓ అందమైన యువకుడి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ నుంచి తీసుకుని తన ప్రొఫైల్ గా పోస్టు చేశాడు. తన పేరు డాక్టర్ అవినాష్ రెడ్డి అని, తాను ఆర్థోపెడిషియన్ ను అని, కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నానని చెప్పాడు. దాంతో యువతి పరిచయాన్ని కొనసాగించింది. 

తన ఫొటోలను అతనికి పంపించింది. ఆమెను నమ్మించి రూ.2 లక్షల 80 వేల రూపాయలు తీసుకున్నాడు. మరింతగా డబ్బుల కోసం అడగడం ప్రారంభించాడు. దాంతో ఆమెకు అతనిపై అనుమానం వచ్చి, తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది.

అప్పటి నుంచి ఆమెను సాయినాథ్ బెదిరించడం ప్రారంభించాడు. ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతాననని బ్లాక్ మెయిల్ చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు మలేసియాలో ఉద్యోగం మానేసి హైదరాబాదు వచ్చింది. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. దీంతో సాయినాథ్ వరంగల్, హన్మకొండ, గుంటూరు హాస్టళ్లలో తలదాచుకుంటూ వచ్చాడు. చివరకు అతన్ని గుంటూరులో అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించారు.