Telangana: తెలంగాణపై కేంద్ర వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం 15 రాష్ట్రాలకు రూ.2451 కోట్లు ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రానికి మొండిచేయి అందించింది.
Telangana: దేశంలో మెరుగైన వృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. పలు అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను పరిగణలోకి తీసుకున్న నీతి అయోగ్ సైతం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సాయం అందించడంలేదని రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది.
ఇక వైద్య విద్యకు సంబంధించిన విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నుంచి మెరుగైన సాయం అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. ఇదే విషయం తాజాగా సమాచార హక్కు చట్టం కింద సంబంధిత వివరాలు కోరగా వెలుగులోకి వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేంద్రం కేటాయించిన నిధులు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు విడుదల చేసిన నిధుల వివరాలను వెల్లడించాలంటూ ఆర్టీఐ కింద ఇనగంటి రవికుమార్ కోరారు. అందుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వైద్యవిద్య విభాగం రాతపూర్వక సమాచారం ఇచ్చింది. సంబంధిత వివరాలు గమనిస్తే.. గత ఏనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాశాఖ వివిధ రాష్ట్రాలకు 2014 నుంచి మార్చి 2022 వరకు రూ.24,505.19 కోట్లు విడుదల చేసింది. అయితే, ఇందులో తెలంగాణ వాటా కేవలం రూ.42.75 కోట్లు మాత్రమేనని కార్యకర్త ఐ.రవికుమార్ దాఖలు చేసిన ఆర్టీఐలో వెల్లడైంది.
ఎంబీబీఎస్ సీట్లు పెంపునకు ఒక్క చిల్లిగవ్వ రూపాయి కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. పీజీ సీట్ల పెంపు కోసం రాష్ట్రానికి రూ.42 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచుకునే క్రమంలో కేంద్రం ఒక్కో సీటుకు గరిష్ఠంగా రూ.1.20 కోట్లు వరకు ఇస్తుంది. ఇది వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు నిష్పత్తుల్లో ఉంటుంది.
ఇక గత ఏడు సంవత్సరాల్లో దేశంలోని 52 వైద్యవిద్య కళాశాలల్లో 3495 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఒకే కేంద్రం ప్రభుత్వం.. అందుకు రూ.2451 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల్లో రాజస్థాన్‌కు రూ.503 కోట్లు, మధ్యప్రదేశ్‌కు 432 కోట్లు, కర్నాటకకు 396 కోట్లు, తమిళనాడుకు 248 కోట్లు, ఒడిశాకు 144 కోట్లు గుజరాత్‌కు రూ.122 కోట్లు కేటాయించింది. అయిఏత, అయితే, ఈడబ్ల్యుఎస్ కోటా కింద అదనంగా 203 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలోని ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో పెరిగాయి. వాటికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. 2014 నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రాయోజిత పథకం కింద వైద్యవిద్య కళాశాలలను మంజూరు చేస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. వీటిని 27 రాష్ట్రాల్లో ఏర్పాటు ఒకే చెప్పిన మోడీ సర్కారు.. తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజీకి కూడా మంజూరు చేయకపోవడం.. రాష్ట్రంపై కేంద్రం వివక్షకు నిదర్శనంగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
