హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి. పార్ధసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

 

2021 ఫిబ్రవరి  10న జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కానుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి తెలిపారు.జీహెచ్ఎంసీలో వార్డుల విభజన ఈ ఎన్నికల్లో లేదని ఆయన ప్రకటించారు. 2016 లో నిర్వహించిన వార్డుల మేరకు ఈ దఫా కూడ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.తెలుగు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయని ఆయన వివరించారు.

నవంబర్ 18వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారని  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా వార్డుల్లో ఓటరు జాబితాను ఆయా డివిజన్ల రిటర్నింగ్ అధికారి పబ్లిష్ చేస్తారని ఆయన తెలిపారు..జీహెచ్ఎంసీ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 20వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. నవంబర్ 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న ఉప సంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. 

 

డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ ను నిర్వహించనున్నారు.మేయర్ అభ్యర్ధికి జనరల్ మహిళకు రిజర్వ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. 

డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రతి వార్డులో అవసరమైన  ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు నామినేషన్ల ఫీజును రూ. 2,500 చెల్లించాలి. జనరల్ అభ్యర్ధులు రూ. 5 వేలు చెల్లించాలని ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి రిటర్నింగ్ అధికారితో పాటు మరో ముగ్గురి సిబ్బందిని నియమించామన్నారు. సుమారు 50 వేల మందిని పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నామన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 9238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సంఖ్యపై ఈ నెల 21వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ పోలింగ్ కేంద్రాల్లో  2700  సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఓటరు స్లిప్ ను పార్టీ గుర్తు లేకుండా ఓటర్లకు ఇచ్చేందుకు అవకాశం కల్పించామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

జీహెచ్ఎంసీలో 74.4 లక్షల మంది ఓటర్లున్నారు.  వీరిలో పురుషులు 52.09 శాతం మంది కాగా, మహిళలు 47.90 శాతం.ఓటర్లున్నారని ఆయన చెప్పారు.అతి పెద్ద డివిజన్ గా మైలార్ దేవ్ పల్లిగా రికార్డుల్లోకెక్కింది. ఈ డివిజన్లో 79,290 మంది ఓటర్లున్నారు.అతి చిన్న డివిజన్ గా రామచంద్రాపురం రికార్డైంది. ఈ డివిజన్లో 27,997 మంది ఓటర్లున్నారు.బన్సీలాల్ పేటలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఫతేనగర్ డివిజన్ లో ట్రాన్స్ జెండర్లు అధికంగా ఉన్నారు.