ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు: విచారణకు మహిళా కమిషన్ ఆదేశం
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది.
హైదరాబాద్: జానకిపురం సర్పంచ్ నవ్య స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై చేసిన ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించింది మహిళా కమిషన్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జానకిపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా రాజయ్య వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై మహిళా ప్రజా ప్రతినిధితో రాయబారం పంపారని కూడా ఆమె మీడియాకు చెప్పారు. అంతేకాదు ఫోన్ లో తనతో మాట్లాడిన మాటలు కూడ రికార్డు చేసినట్టుగా సర్పంచ్ ఆరోపణలు చేశారు. తన మాదిరిగానే ఇతర మహిళా ప్రజా ప్రతినిధులను కూడా ఎమ్మెల్యే వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు అయితే ఈ విషయాలపై తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఏ రకంగా తమను ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.ఈ రకంగా వేధింపులకు పాల్పడవద్దని కొంతమంది మహిళా ప్రజా ప్రతినిధులు వెళ్లి ఎమ్మెల్యే రాజయ్యను కలిసినట్టుగా ఆమె చెప్పారు. అయినా కూడా ఎమ్మెల్యే రాజయ్య ప్రవర్తనలో మార్సు రాలేదని సర్పంచ్ ఆరోపంచారు. తమ గ్రామానికి ఎమ్మెల్యే నిధులు కూడ మంజూరు చేయలేదని జానకిపురం సర్పంచ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటి దొంగలు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయాలపై తాను సీఎం కేసీఆర్ ను కలిసి వివరించనున్నట్టుగా ఆయన చెప్పారు.
also read:ఇంటి దొంగలు శిఖండి పాత్ర పోషిస్తున్నారు: స్వంత పార్టీ నేతలపై తాటికొండ రాజయ్య ఫైర్
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య గతంలో కూడా అనేక వివాదాల్లో చోటు చేసుకున్నారు. తొలిసారిగా కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా రాజయ్య ఉన్నారు. అయితే వివాదాల నేపథ్యంలో రాజయ్యను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. రాజయ్య స్థానంలో ఆనాడు ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేబినెట్ లోకి తీసుకున్నారు. కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు.