Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి హాల్ టికెట్లు జారీ.. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే చాన్స్..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ వచ్చేశాయ్. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్ల జారీచేయనున్నట్టుగా ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ తెలిపారు. 

Telangana ssc exams 2022 hall ticket download from today details here
Author
Hyderabad, First Published May 12, 2022, 9:51 AM IST

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ వచ్చేశాయ్. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్ల జారీచేయనున్నట్టుగా ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్‌ టికెట్లు పంపినట్లు పేర్కొన్నారు. స్కూల్ హెడ్‌ మాస్టర్ల నుంచి హాల్ టికెట్లను పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే వెబ్‌సైట్ నుంచి కూడా విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్తులు హాల్ టికెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45  గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పదో తరగతి హాల్‌టికెట్లు, ముద్రించిన నామినల్‌ రోల్స్‌ను ఇప్పటికే స్కూళ్లకు పంపించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
పరీక్షల షెడ్యూల్..
మే 23 - ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ
మే 23 - ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)
మే 23 - ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)
మే 24 - సెకండ్ లాంగ్వేజ్
మే 25 - థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మే 26 - మ్యాథమెటిక్స్‌
మే 27 - జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌)
మే 28 - సోషల్‌ స్టడీస్‌
మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)
మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌)
జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ)

వీటిలో అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. అయితే జూన్ 1వ తేదీన జరిగే ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ) పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరగనుంది. 

ఇక, కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం కూడా కరోనా కారణంగా ఆలస్యంగానే ప్రారంభం అయింది. ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆరు పేపర్లలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో పేపర్‌కు 80 మార్కులు కాగా, ఇంటర్నల్‌ మార్కులు 20గా ఉంటాయి. మొత్తం సిలబస్‌లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరుగనున్నాయి. 

ఇక, టెన్త్ విద్యార్థులకు మే 6 నుంచి ప్రారంభమైన  ప్రీఫైనల్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. తర్వాత విద్యార్థులు మరోసారి అన్ని సబ్జెక్ట్‌లను రివిజన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, రెండేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios