అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు, గోదావరి బోర్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయన్నారు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్. నీటి వినియోగానికి సంబంధించిన పూర్తి లెక్కలు కావాలని బోర్డులు అడుగుతున్నాయన్నారు.

అయితే గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ చేపట్టలేదని.. గతంలో చేపట్టిన అన్ని ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఉన్నాయని రజత్ కుమార్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిమితికి మించి నీటి వినియోగం జరుగుతుందన్న ఆయన.. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీలు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. 

Also Read:తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు: ప్రారంభమైన గోదావరి రివర్ బోర్డు మీటింగ్

ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను గోదావరి రివర్ బోర్డుకు అందజేశామని రజత్ కుమార్ పేర్కొన్నారు. కాళేశ్వరం, ముమ్మిడిహట్టికి సంబంధించి భారత ప్రభుత్వం 2017లో ఓ లేఖ రాసిందని.. అందులో ఈ రెండు ప్రాజెక్ట్‌లను కొత్త వాటిగా పరిగణించడం లేదని తెలిపిందని రజత్ గుర్తుచేశారు.

కృష్ణా నదిలో విచిత్ర పరిస్ధితి ఉంటుందన్న ఆయన.. ఒకసారి భారీ వరదలు, మరోసారి ప్రవాహలేమి కనిపిస్తుందన్నారు. జూన్ 2, 2014లోపు పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అడగవద్దని తాను బోర్డుకు తెలిపినట్లు రజత్ అన్నారు.

Also Read:ఏపీ- తెలంగాణ నదీ జలాల వివాదం: కృష్ణా యాజమాన్య బోర్డు కీలక ప్రకటన

గోదావరి బేసిన్‌లో తెలంగాణకు 967 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి వుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రజంటేషన్‌ను రజత్ కుమార్ గుర్తుచేశారు. దీనికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని ఆయన తేల్చిచెప్పారు.

పోతిరెడ్డిపాడు పూర్తిగా కొత్త ప్రాజక్ట్ కావడం వల్ల దీని నిర్మాణం కారణంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడాలని తాము కృష్ణా రివర్ బోర్డును కోరినట్లు రజత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెలీ మెట్రీ ఏర్పాటు చేసేందుకు బోర్డు ఛైర్మన్ అంగీకరించారని ఆయన తెలిపారు.