Asianet News Telugu

90 శాతం తెలంగాణ సచివాలయం కూల్చివేత: 4500 లారీల శిథిలాలు

తెలంగాణ సచివాలయంలోని భవనాల కూల్చివేత 90 శాతం ముగిసింది. ఈ రోజు సోమవారం కూల్చివేత పనులను ప్రభుత్వం మీడియాకు చూపించనుంది. హైకోర్టు ఆదేశాలతో ఆ నిర్ణయం తీసుకుంది.

Telangana secretariat buildings 90 percent demolished
Author
hyderabad, First Published Jul 27, 2020, 1:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. 

ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. 

ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. 

ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు బి.ఆర్.కె. భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios