మంగళవారం అర్ధరాత్రి నాటికి విధుల్లో చేరని కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 208 మంది కార్మికులు విధుల్లో చేరినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. 3వ తేదీ 17 మంది, 4న 34 మంది, మంగళవారం 157 మంది కార్మికులు విధుల్లో చేరారు. 

ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంది, ఆర్టీసీలో ఎలాంటి  మార్పులు చేర్పులు చేయాలన్నా కూడ కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.ఆర్టీసీపై కేసీఆర్ తీసుకొనే ఏ నిర్ణయం కూడ చెల్లుబాటు కాదని ఆశ్వత్థామరెడ్డి చెప్పకనే చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ రాత్రి వరకు విధుల్లో చేరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 2వ తేదీన డెడ్‌లైన్ విధించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే ఇక వారిని విధుల్లోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ డెడ్‌లైన్‌కు సంబంధించి ఆర్టీసీ జేఎసీ నేతలు, అఖిలపక్ష పార్టీలతో మంగళవారం నాడు జేఎసీ నేతలు సమావేశమయ్యారు. కార్మికులు ఎక్కడా కూడ విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు కూడ వెనక్కి వచ్చినట్టుగా  ఆయన తెలిపారు.

తాము సమ్మెను విరమించే ప్రసక్తే లేదని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. సమ్మె చేస్తున్న తమతో  ప్రభుత్వం చర్చించాలని  ఆశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వంతో పాటు  కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల ఆర్టీసీ కార్మికులు  చనిపోతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందితే కనీసం ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా కూడ సమ్మె యధావిధిగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ ప్రారంభించకుండానే  బెదిరింపులకు పాల్పడితే ఎలా అని ఆశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు

ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తాం, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని  ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చించాలని  ఆయన డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించేందుకు ముందుకు రావాలని  ఆయన సూచించారు. కార్మికులు ఎవరూ కూడ భయపడకూడదని  ఆశ్వత్థామరెడ్డి కోరారు.