తెలంగాణలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నేటి కేబినెట్‌లో చర్చ: రేపటి నుండి రోడ్లపైకి బస్సులు?
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణ కేబినెట్ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో ప్రయాణీకులతో బస్సులను అనుమతించే అవకాశం ఉంది.
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై తెలంగాణ కేబినెట్ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో ప్రయాణీకులతో బస్సులను అనుమతించే అవకాశం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఈ విషయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకొంది. ప్రభుత్వం అనుమతిస్తే బస్సులు రోడ్లపై తిరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ప్రతి డిపో నుండి ఐదు బస్సులను అత్యవసర సేవల కోసం స్పేర్ లో ఉంచారు.
also read:నాడు సమ్మె, నేడు లాక్‌డౌన్‌తో 55 రోజులుగా నిలిచిన బస్సులు: తెలంగాణ ఆర్టీసీపై దెబ్బ మీద దెబ్బ
ఇప్పటికే రాష్ట్రంలోని గ్రీన్, ఆరంజ్ జోన్లలో లాక్ డౌన్ ఆంక్షలపై తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. కానీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకోలేదు.
ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్రం ఆదివారం నాడు విడుదల చేసింది. ఈ విషయంలో మెట్రో రైళ్లు, విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో రాష్ట్రాలకు అధికారాలను కల్పించింది. దీంతో ఇవాళ కేబినెట్ లో ఈ బస్సుల రాకపోకల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై కూడ చర్చించనుంది.
also read:తెలంగాణాలో ఉధృతమవుతున్న కరోనా వ్యాప్తి: నేడొక్కరోజే 42 కేసులు
మంగళవారం నాడు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ వర్గాలకు సమాచారం ఇచ్చింది. అయితే కేబినెట్ లో చర్చించిన తర్వాతే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారం నాడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశం వివరాలను కేబినెట్ కు మంత్రి వివరించనున్నారు.
రెడ్ జోన్ మినహా ఇతర జోన్లలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయమై చర్చించనున్నారు. అయితే మాస్కులు ధరించినవారికే అనుమతివ్వడంతో పాటు సగం మంది ప్రయాణీకులను మాత్రమే బస్సుల్లో ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.