హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఎసీ మద్దతును కూడగట్టుకోలేకపోయిన ఆర్టీసికి మాత్రం రెవిన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 

తెలంగాణ రెవిన్యూ ఉద్యోగులు ఆర్టీసీ సమ్మెకు తమ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నాడు రెవిన్యూ అసోసియేషన్ ప్రకటించింది. రెవిన్యూ ఉద్యోగులు మద్దతు ప్రకటించడం తమకు మరింత బలాన్ని ఇచ్చినట్టైందని ఆర్టీసీ జేఎసీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తెలంగాణ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు రాములు, ఉపేందర్ రావు, ఎన్. లక్ష్మీనారాయణ, రవి నాయక్, వి. రాములు ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి సంతాప సభలో ఈ విషయాన్ని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు విడనాడాలని రెవిన్యూ అసోసియేషన్ నేతలు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రెవిన్యూ అసోసియేషన్ నేతలు కోరారు.

రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తాము విఫలం చేస్తామని రెవిన్యూ అసోసియేషన్ నేతలు ప్రకటించారు. అంతేకాదు తమ డిమాండ్ల సాధనకు  రానున్న రోజుల్లో తాము సమ్మెకు వెళ్తామని రెవిన్యూ అసోసియేషన్ నేతలు  ప్రకటించారు.

రాష్ట్రంలో రెవిన్యూ శాఖకు పెద్ద దిక్కు ఎవరు లేరన్నారు. రెవిన్యూ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకొన్నాడని గుర్తు చేశారు. తమ సమస్యలను చెప్పుకొనేందుకు సీఎం అపాయింట్ మెంట్ కోరేందుకు ప్రయత్నాలు చేస్తే ఇంతవరకు అపాయింట్ మెంట్ దక్కలేదని వారు గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపడితే భూ రికార్డులను మార్చి 58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను సకాలంలో రైతులకు అందించిన విషయాన్ని రెవిన్యూ అసోసియేషన్ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విధుల నిర్వహణలో రెవిన్యూ ఉద్యోగులు తమ ప్రాణాలను కోల్పోయారని వారు గుర్తు చేశారు. అయినా కూడ తమపై ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ చట్టంలో భాగంగా కొన్ని శాఖలను పంచాయితీరాజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదన చేయనున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెవిన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఆందోళనతో ఉన్నారు. ఈ తరుణంలోనే ఆర్టీసీ సమ్మెకు రెవిన్యూ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. 

ఇదిలా ఉంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మాత్రం ఆర్టీసీ సమ్మెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొంది. సమ్మె చేసే సమయంలో తమకు ఆర్టీసీ జేఎసీ నేతలు మాట మాత్రం కూడ చెప్పలేదని టీఎన్జీవో నేతలు ప్రకటించారు.