Asianet News TeluguAsianet News Telugu

‘తెలంగాణ’ రేవంత్ రెడ్డి దారెటు ?

  • బలపడుతున్న టిడిపి, టిఆర్ఎస్ బంధం
  • కలిసిపోయేందుకు చొరవ చూపిన కేసిఆర్
  • బాబు వైపు నుంచీ సానుకూలమే అంటున్న తమ్ముళ్లు
  • రేవంత్ కు జీర్ణం కాని తాజా పరిణామాలు
  • సరికొత్త వ్యూహరచనలో రేవంత్ శిబిరం
telangana revanth reddy in confugion stage

తాజా రాజకీయాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిండు. రేవంత్ దారి ఎటువైపు అన్న చర్చ తెలుగు రాజకీయాల్లో జోరందుకుంది. నిన్నమొన్నటి వరకు కత్తులు దూసుకున్న టిఆర్ఎస్, టిడిపి నేడు ప్రేమరాగాలు ఆలపిస్తున్న వాతావరణం ఉంది. మరి కేసిఆర్ పై మడమ తిప్పని పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి దారెటో తేలాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్ చెట్టా పట్టాలేసుకుని నడచే వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలపై రేవంత్ శిబిరం ఏరకంగా స్పందిస్తుందా అన్న ఉత్కంఠ ఉధృతమైంది.

తెలంగాణలో సిఎం కేసిఆర్ ఏకపక్ష పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, సిపిఐ నేతలందరినీ టిఆర్ఎస్ లో కలుపుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానిక బలమే లేకుండా చేశారు. వాయిస్ లేని పరిస్థితి కల్పించారు. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కేసిఆర్ కు కరెక్టు ప్రత్యర్థిగా నిలబడేందుకు టి టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కేసిఆర్ పై పోరాటమే తన జీవిత ఎజెండా అన్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా కేసిఆర్ పై విరుచుకుపడుతూ సిసైలైన ప్రత్యర్థి పాత్ర, ప్రతిపక్ష నేత పాత్ర పోశిస్తున్నారు.

ఇంతకాలం ఉప్పూ నిప్పులా ఉన్న టిఆర్ఎస్, టిడిపి మధ్య వాతావరణాన్నికేసిఆర్ అనంత పర్యటన చల్లార్చిందని చెబుతున్నారు. అనంతపురంలో కేసిఆర్ చేసిన హడావిడి అంతిమంగా రెండు పార్టీల మధ్య వైరాన్ని తగ్గించి ప్రేమను, స్నేహాన్ని పంచిందన్న వాతావరణం నెలకొంది. కేసిఆర్ పర్యటన వెనువెంటనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. పయ్యావుల కేశవ్ తో పక్కకు పోయి మాట్లాడుడు తోపాటు వెంటనే తెలంగాణలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదు... అవసరమైతే టిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇది చాలదన్నట్లు ఆంధ్రా రాజకీయాల్లో ఒక టిడిపి ఎమ్మెల్యే ఏకంగా కేసిఆర్ బొమ్మ బ్యానర్ మీద పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తే ఏ పరిస్థితుల్లోనైనా రానున్న ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్ ఒక అవగాహనతో కానీ, పొత్తుతో కానీ ముందుకెళ్లే వాతావరణం నెలకొన్నట్లు చెప్పవచ్చు. మరి ఈ పరిణామాలను రేవంత్ జీర్ణించుకునే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. టిఆర్ఎస్ తో కలిసే పరిస్థితి వస్తే మాత్రం తాను ఆ కలయికలో పాలుపంచుకోబోనని ఆయన సుస్పష్టంగానే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, టిఆర్ఎస్ కలిసి పోటీ చేసే పరిస్థితే వస్తే రేవంత్ తన దారి తాను చూసుకోక తప్పదన్న వాతావరణం నెలకొంది. అయినదానికి కానిదానికి పార్టీలు మారిన చరిత్ర తనకెందుకన్న ఉద్దేశంతోనే రేవంత్ ఇప్పటివరకు టిడిపిని వీడలేదని చెబుతున్నారు. ఆంధ్రాపార్టీ అన్న ముద్ర ఉన్న సమయంలోనూ రేవంత్ టిడిపిని అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ తాజాగా కేసిఆర్ వదిలిన అస్త్రం రేవంత్ కు టిడిపిలో పొగ పెట్టే వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు.

తాజా పరిణామాలు చూస్తే రాజకీయంగా రేవంత్ కు మూడు దారులు ఉన్నాయి.

1 రేవంత్ టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరడం

2 రేవంత్ టిడిపికి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరే చాన్స్

3 ఏ పార్టీలో చేరకుండా చేతనైనంత మేరకు కొత్త పార్టీ పెట్టుకోవడం

ఈ మూడు దారులు రేవంత్ ముందున్నాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు రేవంత్ ఏ దారి ఎంచుకుంటాడన్న దానిపై ఇంక్లా క్లారిటీ రాలేదు. సొంత పార్టీ పెట్టుకోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. మరి అంత సొమ్ము రేవంత్ వద్ద ఉందా అన్నది అనుమానమే. ఎందుకంటే పార్టీ నడపడమంటే వేల కోట్ల వ్యవహారం అన్న విషయంలో రేవంత్ కు క్లారిటీ లేకపోలేదు. గతంలో పార్టీలు పెట్టిన సినీ నటుడు చిరంజీవి, దేవేందర్ గౌడ్ లు నడపలేక ఇతర పార్టీల్లో కలిపి చేతులు దులుపుకున్నారు. తమ దారి తాము చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ పార్టీ పెట్టే సాహసం చేస్తారనుకోలేము.

మరి మిగతా రెండు ఆప్షన్లలో ఏదారిలో వెళ్తారో కూడా చూస్తే తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి రెడ్డి సామాజికవర్గం అండగా ఉంది. టిఆర్ఎస్ ను (ఒకవేళ టిడిపితో కలిస్తే రెండు పార్టీలను కలిపి) ఇరుకునపెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ అడుగులేసే అవకాశాముందని చెబుతున్నారు. ఇంకోవైపు జాతీయ రాజకీయాల్లో ఇంకో టర్మ్ లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముందని భావిస్తే రేవంత్ చివరి ఆప్షన్ గా బిజెపి వైపు కన్నేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా టిడిపి, టిఆర్ఎస్ మధ్య స్నేహం పెరిగిన కొద్దీ రేవంత్ దారిపై స్పష్టత రావొచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/znyV3h

 

Follow Us:
Download App:
  • android
  • ios