Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం..

Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా పలు జిల్లాలకు వాతావరణశాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

Telangana records highest ever rainfall in a single day KRJ
Author
First Published Jul 28, 2023, 3:59 AM IST

Telangana: తెలంగాణ మీద వరుణుడు పగబట్టాడా అన్నట్లు.. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి మగ్గుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెతుత్తున్నాయి. వర్షాలతో జనానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించింది. జులై 24న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ములుగు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.

అయితే తెలంగాణ చరిత్రలో ఏన్నాడు లేని విధంగా  అత్యంత భారీ వర్షంపాతం ములుగు జిల్లాలో నమోదైంది. గడచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేటలో ఏకంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు రికార్డు స్ధాయిలో నమోదైన వర్షపాతంగా పేర్కొంది. గతంలో అత్యధికం వర్షపాతం  ములుగు జిల్లాలోని వాజేడులో నమోదైంది. 2013 జులై 19న వాజేడులో 517.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆ బ్రేక్ చేసినట్టు ఇప్పుడు ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 

అలాగే.. వెంకటాపూర్‌తోపాటు పక్కనే ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో రెండో అత్యధికంగా 616.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా అదే జిల్లాలోని చెల్పూర్ (475.8 మిమీ), రేగొండ (467 మిమీ), మొగుళ్లపల్లి( 394 మిమీ)లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 390.5మి.మీ నమోదైంది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాగల 24 గంటల్లో హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

అలాగే.. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం, అలాగే.. 200ల కేంద్రాల్లో 10 సెంటిమీటర్లకుపైగా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక మాటలో చెప్పాలంటే.. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల గతంలో నమోదైన రికార్లన్నీ బ్రేక్ అయ్యేలా వర్షాలు కురిసినట్టేనని కొత్త గణాంకాలు చెబుతున్నాయి. ఈ వారం రోజుల్లో దాదాపు 300 శాతం అధిక వర్ష పాతం నమోదైనట్టు తెలుస్తోంది.  హైదరాబాద్‌లో కూడా రికార్డు స్తాయిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 6 గంటల్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios