తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం.. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండు, మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. తొలుత ప్రభుత్వం ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఇక, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఒక ప్రటన విడదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అగ్రికల్చర్ పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు.
జూలై 14,15 తేదీల్లో జరగాల్సి ఉన్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వాహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా చెప్పారు. అయితే జూలై 18,19,20 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష యథావిథిగా కొనసాగనుందని తెలిపారు.
Also Read: గోదావరికి భారీ వరద: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ఇక, తెలంగాణలో పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచన వేసింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇక, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
