హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ కార్యాయలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 
 
గాంధీ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాష్ట్రప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవ భారత నిర్మాణానికి ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బీజం వేస్తే ప్రస్తుత కేంద్రం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి గుర్తుచేశారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 

అటు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు 73వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.  

ఉద్యమ సమయంలో విమోచన దినం జరపాలని అన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని లక్ష్మణ్ విమర్శించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తామని అందుకు తాను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల జమ్ముకశ్మీర్ సమస్యకు మోదీ ముగింపు పలికారని కొనియాడారు. 18 రాష్ట్రాలలో 50 శాతానికి పైగా ప్రజలు మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. 

ఈ సందర్బంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరమత సహనం పట్ల వేదాలు వల్లిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు అభద్రత భావంలో ఉన్నారని విమర్శించారు. 

మజ్లీస్‌ను చంకలో పెట్టుకొని కేటీఆర్ పరమత సహనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మత విద్వేషాలు రెచ్చ గొట్టే వారితో టీఆర్ఎస్ అంటకాగుతుందంటూ మండిపడ్డారు. నియంతృత్వ పోకడలకు, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలంటూ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.  

ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర భారతదేశానికి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు చంద్రబాబు. 

స్వలాభం, కుటుంబ బంధాల వంటి వాటిని తృణప్రాయంగా వదిలి దేశం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఫలితంగా నేడు స్వాతంత్య్రం అనుభవిస్తున్నట్లు తెలిపారు.  

భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఉంచడం మన బాధ్యతని అన్నారు. కొన్ని తరాల పోరాటం, దేశప్రజల త్యాగం, సహకారం, ఐక్యతవల్లే దేశానికి స్వేచ్ఛ లభించిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  

మరోవైపు భగత్ సింగ్ లాంటి త్యాగధనుల కారణంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చాలా బాధేస్తోందని వ్యాఖ్యానించారు. 

రాజకీయాలు పూర్తిగా అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని గుర్తు చేశారు. విలువలు, ఆశయాలతో పవన్ రాజకీయం చేస్తున్నారని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  డబ్బులేని రాజకీయాలంటే ఏంటో పవన్ కళ్యాణ్ చూపించారని తెలిపారు. 


డిసెంబర్ అనంతరం తెలంగాణలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని తెలిపారు. పవన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. రాజకీయ జవాబుదారీతనం తోనే జనసేన పార్టీ రాజకీయాలు చేస్తుందని శంకర్ గౌడ్ తెలిపారు.