Telangana MLAs Defection: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Telangana MLAs Defection: తెలంగాణలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అంశం ఉంది. మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. న్యాయసలహా అనంతరం ఈ నిర్ణయానికి తీసుకున్నట్టు తెలుస్తోంది.

సుప్రీం కోర్టు తీర్పు

గత నెల 25న పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పులో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అడ్వొకేట్ జనరల్‌, సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాత స్పీకర్‌ ఈ నోటీసులపై సంతకం చేసినట్లు చెబుతున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ తరఫున గెలిచి, తరువాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల జాబితాలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే వీరిలో కొందరు తాము కాంగ్రెస్‌లో చేరలేదని వాదిస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఈ పది మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ శిబిరంలో చేరడం రాజకీయ సంచలనం రేపింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు.

మొదట హైకోర్టు స్పీకర్‌ను నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ విచారణ తరువాత న్యాయస్థానం ఎమ్మెల్యేలకే నేరుగా నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాల మధ్య తాజాగా స్పీకర్‌ కూడా నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు.