హైకోర్టు ఆదేశాలతో ఏపీ అంబులెన్స్‌లకు తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దని పోలీస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా టోల్‌ప్లాజా వద్ద ఏపీ అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ - పాస్ లేకున్నా ఏపీ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు పోలీసులు. 

కాగా, బోర్డర్‌లో అంబులెన్స్‌లను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆసుపత్రి కన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయాలన్న సర్క్యూలర్‌కు బ్రేక్ పడింది.

Also Read:సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత: కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

కరోనా రోగులను తీసుకొస్తున్న అంబులెన్స్‌లపై ఎలాంటి నిషేధం విధించి సర్క్యూలర్ ఇవ్వరాదని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది.

దీంతో ఏపీ సర్కార్ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సానుకూలత వ్యక్తం చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టు ఆదేశించినప్పటికీ సర్క్యూలర్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ పౌరుల బాధ్యత తెలంగాణ సర్కార్‌దేనని ఏజీ కోర్టులో వాదించారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా మేలు చేస్తోందని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో సైతం ఇలాంటి నిబంధన  వుందని చెప్పారు. ఆసుపత్రి అనుమతి వుంటేనే పేషెంట్‌కి అనుమతి ఇస్తామని తెలిపారు. కోర్టు మాత్రం ఓవైపు బోర్డర్‌లో రోగులు చనిపోతుంటే మీరు సర్క్యూలర్‌లు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

మరోవైపు కర్నూలు శివార్లలో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీ- తెలంగాణ రాష్ట్రాల అనుమతులు, హైదరాబాద్ ఆసుపత్రుల అడ్మిషన్ ఖరారైనా అనుమతించడం లేదు.