Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత: కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

రాష్ట్రంలోకి కరోనా రోగుల ప్రవేశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై  హైకోర్టు శుక్రవారం నాడు స్టే విధించింది. 

Telangana High court stays on Telangana Government circular on other states covid patients lns
Author
Hyderabad, First Published May 14, 2021, 3:53 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలోకి కరోనా రోగుల ప్రవేశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై  హైకోర్టు శుక్రవారం నాడు స్టే విధించింది. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపొద్దని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి సర్క్యులర్స్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.  కోవిడ్ పేషేంట్లను తీసుకొచ్చే అంబులెన్స్ లపై ఎలాంటి నిషేధం విధించే సర్క్యులర్లను ఇవ్వొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లు, రోగుల నిలిపివేతపై మాజీ ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.  సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేతపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకే్ జనర్ శ్రీరాం వాదనలు విన్పించారు.  ఏపీ ప్రభుత్వం వాదనలపై  తెలంగాణ హైకోర్టు  కొంత సానుకూలతను వ్యక్తం చేసింది.

ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు విన్పించడానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు విన్పించారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్  బీఎస్ ప్రసాద్  వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు.  ఇతర రాష్ట్రాల రోగులను సరిహద్దుల్లో ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది.  తెలంగాణకు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులున్నాయని ఏజీ హైకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ పౌరుల బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని మీరే మారుస్తారా అని ప్రశ్నించింది.దేశంలో ఇలాంటి సర్క్యులర్ ఎక్కడా చూడలేదని హైకోర్టు అభిప్రాయపడింది.  సరిహద్దుల్లో వైద్యం అందక రోగులు మరణిస్తున్నారని హైకోర్టు  ఈ సందర్భంగా తెలిపింది. 

దేశంలో ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకొనే హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అంబులెన్స్ లను ఆపొద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది.  రాజ్యాంగం కంటే మీ సర్క్యులర్ గొప్పదా అని కూడ హైకోర్టు వ్యాఖ్యానించింది.  అయితే ఈ సమయంలో మహారాష్ట్రలో కూడ ఇదే తరహాలో సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

 

also read:రాజ్యాంగం కంటే మీ సర్క్యులర్ గొప్పదా?: అంబులెన్స్ ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం రాష్ట్రాలకు కల్పించిన అధికారాల మేరకే తాము ఈ సర్క్యులర్ జారీ చేసినట్టుగా ఏజీ కోర్టుకు తెలిపారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించడం లేదని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులను రాకూడదనే ఉద్దేవ్యంతోనే  ఈ సర్క్యులర్ జారీ చేసినట్టుగా చెప్పారు.జీవించే హక్కును కాదనడానికి మీకు ఏ అధికారం ఉందని హైకోర్టు  ప్రశ్నించింది. అడ్వకేట్ జనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.  హైద్రాబాద్ నుండి వేరే రాష్ట్రాలకు రోగులు వెళ్లడం లేదా అని హైకోర్టు ప్రశ్నించింది.  ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ వచ్చినవారిని చాలా రాష్ట్రాల్లోకి అనుమతించడం లేదని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ తెలిపారు. అంబులెన్స్ లో వచ్చివన్నీ పాజిటివ్ కేసులేనని ఆయన చెప్పారు. 

ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది జూన్ 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios