ఐటీ వాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్... ఆ ఉద్యోగులు ఇలా చేయండి..: భారీ వర్షాలతో పోలీసుల సూచన
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని... అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాాలని సూచించారు.
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులపైకి, కాలనీలు, అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నారు. ఇలా భారీ వర్షం, రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీస్ శాఖ సూచించింది. ఐటీతో పాటు అవకాశమున్న ఇతర రంగాల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలు కొనసాగే అవకాశం వుండటంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా వుండాలని... ముఖ్యంగా లోతట్టుప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం లేని ఉద్యోగులు ఇళ్లు, ఆఫీసు మధ్య రాకపోకలు సాగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాని అన్నారు. వర్షపు నీటిలో ప్రయాణించేటపుడు ఎక్కడ ఏముందో తెలియదు కాబట్టి చూసుకుని ముందుకు వెళ్లాలని పోలీసులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
అత్యవసరంగా ఇళ్లనుండి బయటకువచ్చివారు ఏదయినా సాయం అవసరం వుంటే డయల్ 100 కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు హైదరాబాద్ తో పాటు జిల్లాల ప్రజలకు ముందు జాగ్రత్త సూచనలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Read More ప్రగతి నగర్‌లో విషాదం : నాలాలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. గాలింపు చర్యలు
ఇక గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాదీలు తడిసి ముద్దవుతున్నారు. ఇక గత 24 గంటల్లో భారీ నగరంలో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా మియాపూర్ ప్రాంతంలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక కూకట్ పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, బస్తీలను వరదనీరు చుట్టుముట్టింది. పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ సెల్లార్లు, ఇళ్లలోని వర్షపునీరు చేరింది. మూసీలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హస్సేన్ సాగర్ లోకి కూడా భారీ వరద వచ్చి చేరుతోంది.
లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లపై గుంతల్లో వరదనీరు నిలవడంతో వాహనాలు మెల్లగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రజలకు ఎప్పటికప్పు వాతావరణ సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు ఎక్కువైతే మునకకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాని జిహెచ్ఎంసి కమీషనర్ అధికారులను సూచించారు.