Asianet News TeluguAsianet News Telugu

నిన్నెవరు కొట్టారయ్యా???

తెలంగాణాలో టిడిపిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. 15 లక్షల లక్ష్యంలో చేరినవారు 2 లక్షలు మించలేదు. కారణం మోదీ నోట్ల దెబ్బయా లేక పార్టీని వదిలించుకుంటున్నారా

Telangana people not interested to join TDP

 

 

కొత్తవాళ్లెవరూ చేరకుండా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసెందవరు?

 

మోదీయా, తెలంగాణా సెంటిమెంటా.

 

అంతా అనుకున్నట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆంధ్రోళ్ల పార్టీగా ముద్రపడిన ఆ పార్టీ లో కొత్తగా సభ్యత్వం తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  పార్టీలో చేరితే మంచి రోజులుంటాయని భరోసాయే ఆ పార్టీ నాయకత్వమే కల్పించ లేక పోయింది. దానికితోడు, ఎవరెన్ని చెప్పినా ముఖ్యమంత్రి కెసిఆర్ హవా నడుస్తూనే ఉంది.  ఈ సునామీని ఎదిరించి తెలుగుదేశం పార్టీలో చేరాలంటే, 2019లో కాకుంటే,  2024లో నయినా  ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా కల్గించాలి. ఇపుడున్న పరిస్థితులలో తెలంగాణాలో ఎవరూ ధైర్యంగా  టిడిపి బ్యాడ్జ్ తగిలించుకునే పరిస్థితి లేదు.  ఇలాంటపుడు టిడిపి సభ్యత్వం కోసం ఎవరు ఉరుకుతూ వస్తారు?

 

సభ్యత్వం తీసుకోవాలంటే తన వెనక టిడిపి ఉందని,  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాకుంటే ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబయినా ఉన్నారని భరోసా ఉండాలి.   అయితే,వీళ్లిద్దరూ హైదరాబాద్ రావడమే లేదు, వచ్చినా ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్ దాటి వెళ్లడం లేదు.  చినబాబు తెలంగాణా రాజ్యం ఇన్ చార్జ్ గా వస్తాడనుకున్నారు.  అదీ కాలేదు. సభ్యత్వ నమోదు ప్రారంభానికి కూడా వచ్చే తీరిక ఆయనకు లేకుండా పోయింది.   అంటే తెలంగాణానికి గాలికొదిలేసినట్లే కదా. గాలికొదిలేసిన మొక్క పెరిగితే పెరుగుతుంది, లేకపోతే లేదు.

 

టిడిపి సభ్యత్వం తీసుకునేందుకు ప్రోద్బలం లేకుండా పోవడంతో సభ్యత్వ దారుణంగా పడిపోయింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ ఒకటో తేదీన మొదలయింది, నెలాఖరున ముగుస్తుంది. తెలంగాణా లో  15 లక్షల సభ్యులను చేర్పించాలనుకున్నారు. ఇక నెలాఖరుకి మూడు రోజులే గడువున్నా అదివారం నాటి సభ్యుల సంఖ్య 1.76 లక్షలు దాట లేదు. ఈ మూడు రోజుల్లో ముమ్మరంగా చేర్పింపు జరిగితే రెండు లక్షలు చేరవచ్చు లేదా కొంత దాటవచ్చు. అంటే 13 శాతం మించదు.

 

 తెలుగుదేశం సభ్యత్వం మీద ఇంతటి దారుణ దెబ్బతీసిందెవరు?

 

ఆదివారం  నాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలంగాణా తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ నోట్ల రద్దు దెబ్బ సభ్యత్వ నమోద కార్యక్రమానికి తగిలిందని  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.  పార్టీ మీద అభిమానం, నిప్పులాంటి మనిషయిన చంద్రబాబు పార్టీని  అధికారంలోకి తేవాలన్న తెగింపు ఉంటే, సభ్యత్వం నమోదు చేసుకోవడాన్ని ఎవరయినా అడ్డుకోగలరా? ఒక వేళ  సభ్యత్వ రుసుం కోసం డబ్బులు  లేవా అనుకుంటే,  ఆ విషయంలో అదుకునేందుకు లోకల్ టిడిపి నాయకులుండనే ఉన్నారు. కాబట్టి దీనికంటే బలమయిన శక్తేదో పని చేసి ఉండాలి.

 

మూడు  కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో రెండులక్షల మించి సభ్యులు కూడా లేరంటే  కారణాన్ని మోదీ నోట్ల రద్దు మీదకు తోసేయడమేమిటి?  అసలు కారణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడమే ఇది.  ఎందుకంటే ఆంధ్ర లక్ష్యం 60 లక్షలలో ఇప్పటిదాకా సభ్యత్వం  33 లక్షలు దాటింది. ఆ లెక్కన తెలంగాణాలో కూడా 50 శాతమో, లేదా కనీసం 25 శాతమయినా రావాలి. అంటే, కేవలం నోట్ల దెబ్బ అనుకోలేం. 

 

  తెలంగాణా ప్రజలు తెలుగుదేశాన్నిఅభిమానించడం మానేస్తున్నారా?

 

 ఎమ్మెల్యే లు ఎలాగయితే పార్టీని వదిలేసి వెళ్లారో,  సభ్యులు కూడా ఈపార్టీని వదిలించుకుంటున్నారా?

 

ఈ దుస్థితిని  తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు ఎలా అధిగమిస్తారోచూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios