ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కేబినెట్ మంత్రులకు గత ఆరేళ్లుగా అబద్ధాలు మాట్లాడటం, దబాయించడం అలవాటైందని ఉత్తమ్ మండిపడ్డారు.

ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు చెబుతూ వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Also Read:జగదీష్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్: నువ్వెంతంటే నువ్వెంతంటూ స్టేజీపైనే వాగ్యుద్ధం

రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తే అడ్డగోలుగా మాట్లాడారని పీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని.. ఎన్నికల తర్వాత ఎప్పుడూ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

పసుపు రైతుల విషయంలోనూ సీఎం కేసీఆర్ మాట తప్పారని , నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డే కారణమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ అభివృద్ధి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. తాము నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నామని పీసీసీ చీఫ్ వివరించారు.