Asianet News TeluguAsianet News Telugu

జగ్గారెడ్డికి షాక్, రేపు మీడియా సమావేశం: ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ షాక్ తగిలింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచే కాకుండా ఇతర బాధ్యతల నుంచి కూడా రేవంత్ రెడ్డి తప్పించారు.

Telangana PCC gives shock to Jagga Reddy: Revanth Reddy to leeave for Delhi
Author
Hyderabad, First Published Mar 21, 2022, 6:57 PM IST

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరుగుబాటు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ షాక్ ఇచ్చింది.  తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి టీపీసీసీ జగ్గారెడ్డిని తప్పించింది. అంతేకాకుండా, పార్లమెంటు నియోజక వర్గాల బాధ్యతల నుంచి, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది. జగ్గారెడ్డి ఇప్పటి వరకు నిర్వహించిన బాధ్యతలను టీపీసీసీ ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది. అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించారు. 

కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం మేరకే తెలంగాణ పీసీసీ జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంది. తాను స్వతంత్రంగా ఉంటానని, కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉండబోనని గతంలో జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఆ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం టీపీసీసీకి సూచించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రే్పు మంగళవారం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన తాజా నిర్ణయాన్ని ఆయన ఈ మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి ఆదివారంనాడు సవాల్ విసిరారు. తనపై కాంగ్రెసు తరఫున ఎవరినైనా పోటీకి దించి గెలిపించుకోవాలని ఆయన ఆ సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేసే దమ్ములు ఎవరికీ లేవని కూడా ఆయన అన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెప్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోజగ్గారెడ్డికి భారీ షాక్ తగిలింది.

ఇదిలావుంటే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు మంగళవారం కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్ ను కలుస్తారు. తాజా పరిణామాలపై రేవంత్ రెడ్డి ఠాగూర్ కు వివరించే అవకాశం ఉంది. జగ్గారెడ్డితో పాటు వి హనుమంతరావు వంటి సీనియర్లు కొంత మంది అశోకా హోటల్ లో పెట్టిన సమావేశంపై కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. జగ్గారెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది. అసంతృప్త నేతలు ఓ వైపు అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూనే రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios