తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొత్తుల వ్యాఖ్యలతో కలకలం రేపిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పరోక్ష హెచ్చరిక చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసే వ్యాఖ్యలు చేయవద్దని హుకుం జారీ చేశారు.

జనగాం: తమ పార్టీ భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పిసిసి తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డితో పడడం లేదనే విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన అన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. తాను ఆ విధమైన వ్యాఖ్యలు చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే వద్ద మర్నాడు బుధవారం చెప్పారు. అయితే మంగళవారంనాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసినట్లు వచ్చిన వార్తలు మాత్రం సంచలనంగానే మారాయి. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంది. బిఆర్ఎస్,కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని తాను చెప్పిన మాటలు నిజమని తేలిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు ఖండించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మంగళవారంనాడు అతి మామూలుగానే స్పందించారు. బుధవారం నాడు కాస్తా కఠినంగా మాట్లాడారు.

కార్యకర్తలు మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడి, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధినేతగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హెచ్చరికలాంటిది చేస్తూ మిగతా వాళ్లు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడవద్దనే సంకేతాలను పంపించారు. తన నాయకత్వంపై వ్యతిరేకతతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆ విధంగా హెచ్చరిక చేశారని కూడా అనుకోవచ్చు. అదే సమయంలో తన నాయకత్వాన్ని పటిష్టపరుచుకునే విధంగా లేదా స్థిరీకరించుకునే విధంగా పొత్తులపై స్పష్టత కూడా ఇచ్చారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బిఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఆయన చెప్పారు. విజయావకాశాలున్పప్పుడు పొత్తుల గురించి మాట్లాడడం అనవసరమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పరోక్ష విమర్శలు కూడా చేశారని అనిపిస్తోంది. తాను ప్రజాక్షేత్రంలో ఉన్నానని, ప్రజల సమస్యలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యానని, కొంత మంది నాయకులు విలాసవంతమైన, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎసీ గదుల్లో కూర్చుని ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డి అన్నారు.