కేసీఆర్ గారు... అన్నదాతల ఉసురు పోసుకోవద్దు..: ఈటల సీరియస్
ఈ సీజన్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా చెబుతున్నా సీఎం కేసీఆర్ కేవలం రాజకీయ లబ్దికోసమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.
కరీంనగర్: ఈ సీజన్లో ఎంత ధాన్యం అయినా కొనుగొలు చేయండి అని కేంద్రం స్పష్టంగా చెప్పింది... అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సీజన్ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వర్షాకాలం పంటను సరైన సమయంలో కొనలేదని అన్నారు. దీంతో నెలరోజులుగా రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని... చాలామంది రైతులవద్ద ధాన్యం తడిసి మొలకెత్తిందని ఈటల ఆందోళన వ్యక్తం చేసారు.
తెలంగాణ రైతాంగం రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కన్నీరు పెడుతోందని eatala rajender ఆవేదన వ్యక్తం చేసారు. CM KCR కు ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని... తక్కువ ధరకు వడ్లు అమ్ముకుంటున్నారని అన్నారు. రైతుల ఉసురు పోసుకోవద్దంటూ సీఎం కేసీఆర్ పై ఈటల మండిపడ్డారు.
''union government రైతు చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించింది. మీరు కూడా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా నేను కొనలేదని రైతులకు క్షమాపణ చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయాలి. రైతు తెలివి లేని వారు, చదువు రాదు, సంఘటితంగా ఉండరు అని అనుకుంటున్నారేమో సందర్భం వచ్చినప్పుడు రైతులు మీకు కర్రు కాల్చి వాత పెడతారు'' అని ఈటల హెచ్చరించారు.
read more నిరుపేద మహిళలతో కలిసి ఈటల భోజనం... సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
''కేసిఆర్ గారు... మీరు రాజకీయాలు చేసుకోండి కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. రైతులతో పెట్టుకున్నవారు ఎవరు ముందుకు పోలేదు. కరీంనగర్ జిల్లా రోడ్ల మీద ఉన్న ధాన్యంను నాలుగు రోజుల్లో కొనుగోలు చేయాలి. లేదంటే కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి చేస్తాము'' అని ఈటల హెచ్చరించారు.
గతకొంతకాలంగా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పైఈటల విరుచుకుపడుతున్నారు. ఇటీదల ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో కేంద్రంపై సీఎం చేసి విమర్శలకు కూడా ఈటల కౌంటరిస్తూ కేసీఆర్ పతనం ప్రారంభమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
read more ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. పీయూష్ గోయల్‌ని కలిసిన తెలంగాణ మంత్రులు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.కేసీఆర్ అనాలోచిత విధానాల కారణంగానే రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అన్నీ తనకు తెలుసుననే అహంకారపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. దాదాపు 40 రోజులుగా రాష్ట్రంలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ధాన్యం రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మొలకెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు వచ్చిన కష్టానికి కేసీఆర్ బాధ్యుడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకొన్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని అసెంబ్లీలో కూడా సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరిస్తుందనే విషయాన్ని ఏనాడూ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదన్నారు. ధాన్యం కొనుగోలు కోసం గన్నీ బ్యాగుల నుండి ప్రతిదీ కేంద్రం చూసుకొంటుందని ఈటల పేర్కొన్నారు.