హైదరాబాద్: వారం రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అయినా కూడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.బుధవారం నాడు  ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రానున్న మూడు నాలుగు వారాలు చాలా కీలకమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 45 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 95 శాతం  రికవరీ అవుతున్నారని  ఆయన చెప్పారు. 

కరోనాపై ప్రజల్లో ఎప్పటికప్పుడు  అవగాహన కల్పిస్తున్నట్టుగా చెప్పారు. లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విరోచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారే పరీక్షలకు రావాలని  ఆయన సూచించారు.రాష్ట్రంలో కోవిడ్ రోగులకు  బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి బాధితులకు 50 వేల పడకలు కేటాయించినట్టుగా చెప్పారు. అవసరమైతే తప్ప ఆసుపత్రుల్లో చేరవద్దని ఆయన కరోనా రోగులను కోరారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona