హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు టీఎన్‌జీవో మద్దతు తెలపనుంది.ఈ మేరకు టీఎన్‌జీవో నేతలు కొద్దిసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.

తమ డిమాండ్ల సాధనకు  ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ నేతలు తమ సమ్మెకు అన్ని సంఘాల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే జేఎసీ నేతలు మంగళవారం నాడు సాయంత్రం టీఎన్‌జీవో నేతలతో భేటీ అయ్యారు. సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.

సమ్మెకు వెళ్లే ముందుకు ఆర్టీసీ కార్మికులు కనీసం తమతో మాట మాత్రంగా కూడ చర్చించలేదని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ప్రకటించారు.

టీఎన్‌జీఓ కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల జేఎసీ మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి  టీఎన్‌జీవో నేతలు  ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో  టీఎన్‌జీవో నేతలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో  టీఎన్‌జీవోలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మె పేరుతో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

ఈ సమ్మెకు టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయపార్టీలు కూడ మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ జేఎసీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది .ఈ బంద్ కు పలు రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచాయి.ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కూడ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

 రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వథామ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు  తెలంగాణ ఎన్జీవో నేతలతో భేటీ అయ్యారు. తమ సమ్మెకు మద్దతుగా నిలవాలని టీఎన్‌జీవో  అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో పాటు కార్యవర్గసభ్యులను కోరారు. ఈ సమ్మెకు తెలంగాణ ఎన్‌జీవో నేతలు కూడ సానుకూలంగా స్పందించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లకు తాము మద్దతును ప్రకటిస్తామని తెలంగాణ ఎన్‌జీవో నేతలు ఆర్టీసీ జేఎసీ నేతలకు సమాధానమిచ్చారు.ఈ విషయమై జేఎసీ నేతలు అధికారికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించనున్నారు.

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు టిఎన్‌జీవో నేతలు మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడ లేకపోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుతో పాటు మరో నాలుగు తీర్మానాలను కూడ టీఎన్‌జీవో చేసింది.