హైదరాబాద్: మెజారిటీ కార్పోరేషన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పాగా వేసింది. తెలంగాణలోని 9 కార్పోరేషన్లలో ఆరు కార్పోరేషన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. నిజామాబాద్ కార్పోరేషన్ లో మాత్రం బిజెపి ఆధిక్యతలో కొనసాగుతోంది. 

అయితే, టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నాయి. ఈ ఫలితంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. కాగా, కరీంనగర్ నగర పాలక సంస్థ ఫలితం ఈ నెల 27వ తేదీన వెలువడనుంది. కరీంనగర్ నగర పాలక సంస్థకు ఈ నెల 24వ తేదీన పోలింగ్ జరిగింది.

బడంగ్ పేట, మీర్ పేట, బండ్లగుడా జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదీగుడా, జవహర్ నగర్, నిజాంపేట నగర పాలక సంస్థలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేసే అవకాశం ఉంది.రామగుండం నగరపాలక సంస్థలో కూడా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.