హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయన కొడంగల్ లో రెండు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. 

మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ 7 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెసు కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ కు అత్యధిక సమయం కేటాయించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.