హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయ కేతనం ఎగరేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పందించారు.  2014 నుంచి అమలు చేస్తూ వస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్లనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. 

మున్సిపల్ మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కేటీఆర్ అన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఉదయం నుంచే ఆయన ఓట్ల లెక్కింపు సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ సంబరాల్లో మునిగిపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. ఆయన సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడుతారు. మున్సిపల్ ఫలితాలపై ఆయన అభిప్రాయాలను చెబుతారు. 

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.