హైదరాబాద్: తాను ఎన్టీఆర్ వేవ్, ఇందిరా గాంధీ వేవ్ చూశానని, అయితే ఇటువంటి వేవ్ తాను చూడలేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆ విధంగా అన్నారు. నాయకత్వం పట్ల ఇటువంటి నిలకడైన వేవ్ ను చూడలేదని ఆయన అన్నారు.

అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ప్రజలు విశ్వాసం ప్రకటిస్తూ వచ్చారని, ఇప్పుడు మున్సిపాలిటీల్లోనూ ఆ విశ్వాసం ప్రకటించారని, ఇటువంటి నిలకడైన వేవ్ ను తాను మొదటిసారి చూస్తున్నానని ఆయన అన్నారు. 

ఈ విజయంతో తమ బాధ్యతలు పెరిగాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అహంకారం పెరగవద్దని ఆయన అన్నారు. తాము ఈ ఎన్నికల్లో 80 లక్షల రూపాయల ఎన్నికల మెటీరియల్ మాత్రమే పంపించామని, పార్టీ నుంచి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజలు అమ్ముడు పోయారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తాము 115 నుంచి 120 మున్సిపాలిటీలను, నగర పాలక సంస్థలను గెలుచుకునే అవకాశం తమకు ఉందని ఆన్నారు. ఇటువంటి విజయంలో అంతటా దొంగ ఓట్లు వేస్తారా అని ఆయన అడిగారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉన్న చోటు కూడా తమ పార్టీ విజయం సాధించిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రతిపక్షాలు గెలిచిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. 

ఎన్నికల ప్రచారం వరకు ఏమైనా మాట్లాడవచ్చు గానీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన అన్నారు.  ప్రతిపక్షాలు ఆ విధమైన విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల పిచ్చికూతలు పట్టించుకోవద్దని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజలు తమ పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. 

పల్లె ప్రగతి మాదిరిగా పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామని, ప్రభుత్వ పరంగా ఈ శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. పట్టణీకరణ పెరుగుతోంది కాబట్టి కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. వాటిపై అవగాహన కల్పించి ముందుకు సాగడానికి ఆ శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. అందుకు 20 ఎకరాల్లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.