హైదరాబాద్: ప్రజల తమ పట్ల విశ్వాసం ప్రకటించారని, ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండని ప్రజలు తమకు చెప్పినట్లు భావిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేసిన రామారావుకు తన ఆశీస్సులు అంటూ ఆయన కుమారుడు కేటీఆర్ పై అన్నారు. 

వంద శాతం సెక్యులరిజాన్ని అనుసరిస్తున్నామని, అన్ని మతాలనూ కులాలను సమానంగా చూస్తున్నామని, అందువల్ల తమను ప్రజలు గెలిపించారని, ప్రజలు తమకు మార్గదర్శనం చేసినట్లుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు విజేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి ఘన విజయం సాధించదని కేసీఆర్ అన్నారు. అంతకు ముందు కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 100కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.