సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఆయన ఇలాకాలో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. కాంగ్రెసు చైర్ పర్సన్ అభ్యర్థి, తన సతీమణి  నిర్మల గెలిచినప్పటికీ అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 

సంగారెడ్డిలో కాంగ్రెసు 10 స్థానాలను దక్కించుకోగా, టీఆర్ఎస్ 15 వార్జులను దక్కించుకుంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. జగ్గారెడ్డికి ఝలక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు తీవ్రంగా కృషి చేశారు. ఆయన చక్రం తిప్పడంతో జగ్గారెడ్డికి ఎదురదెబ్బ తప్పలేదని అంటున్నారు. 

నిజానికి, శాసనసభ ఎన్నికల్లోనే జగ్గారెడ్డిని ఓడించడానికి హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలను హరీష్ రావు సీరియస్ గా తీసుకున్నారు. హరీష్ రావు కృషి ఫలించిందని టీఆర్ఎస్ స్థానిక నాయకులు అంటున్నారు శాసనసభ ఎన్నికల్లో జగ్గారెడ్డిని ఓడించలేకపోవడంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో హరీష్ రావు ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు.. 

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు, 9 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ స్థితిలో టీఆర్ఎస్ తన సత్తాను చాటుతోంది.