ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు, న్యాయ పోరాటం: జగదీష్ రెడ్డి
ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు ఏపీ నుండి రావాల్సిన బకాయిల విషయంలో కేంద్రం నుండి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.
సూర్యాపేట: ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలను నెల రోజుల్లోపుగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం రూ .3,441.78 కోట్లతో పాటు సర్ చార్జీని కూడ కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సోమవారం నాడు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కక్షసాధింపుల్లో భాగంగానే కేంద్ర సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. వనరుల వినియోగంతో దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీకి రుచించడం లేదన్నారు.బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్నందునే తెలంగాణను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
also read:ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలి: తెలంగాణకు కేంద్రం ఆదేశం
తెలంగాణకు ఏపీ నుండి రూ. 12,941 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఏకపక్షంగా ఏపీ వాదనలు విని ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన విమర్శించారు.2014 జూన్ 2నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పిర్యాదు చేసింది. విద్యుత్ సరఫరా కోసం రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో సర్ చార్జీ చెల్లించాలని కూడా కేంద్రం ఆదేశించింది..
ఇటీవల కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రానికి చెందిన సమస్యలు పరిష్కరించాలని ప్రధాని మోడీకి వినతిపత్రం సమర్పించారు. విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశం తర్వాత ఏపీకి చెందిన సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. గత వారంలో ఈ విషయమై ఈ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే.