హైదరాబాద్: తెలంగాణ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు వాణిదేవి దిగిపోయిన తర్వాత ఆ కారు ప్రమాదం సంభవించింది. వాణిదేవిని అసెంబ్లీ ఆవరణలో దింపేసి, పార్క్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

అసెంబ్లీ 8వ నెంబర్ గేట్ ను డీకొట్టి ప్రమాదానికి గురైంది. కారు టైర్ పేలి పెద్ద యెత్తున శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది. అయితే కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

అతి వేగంగా పార్క్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎవరూ లేకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, రోజు నడిపే డ్రైవర్ కాకుండా గన్ మన్ కారును నడిపినట్లు తెలుస్తోంది. కారును నడిపిన గన్ మన్ భాను ప్రకాశ్ ను హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశాడు.

వాణిదేవి ఇటీవ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమె మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు.