తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Telangana MLC Elections 2021) పోలింగ్ కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Telangana MLC Elections 2021) పోలింగ్ కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన ఆరు స్థానాలకు నేడు పోలింగ్ (MLC Elections Polling) జరుగుతుంది. మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు ఈ ఆరు స్థానాల్లో పోటీ పడుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. 

ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 37 పోలింగ్‌ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఎక్క‌డి నుంచి ఎందరు పోటీ అంటే.. ? 
అని చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా.. ఖమ్మం, మెదక్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇంకా మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. వీరిలో కొందరు టీఆర్‌ఎస్ రెబల్స్ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానం ఖాళీగా ఉంటే అక్క‌డ ఇద్ద‌రు పోటీలో ఉన్నారు. అలాగే క‌రీంగ‌న‌ర్‌లో ఉన్న రెండు స్థానాల‌కు ప‌ది మంది పోటీలో ఉన్నారు. ఖ‌మ్మంలో రెండు స్థానాల‌కు నలుగురు, న‌ల్గొండ‌లో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. అలాగే మెద‌క్‌లో ఒక స్థానానికి ముగ్గరు పోటీలో నిలిచారు. మ‌రి ఇందులో అధికారిక పార్టీకి చెందిన వారు కాకుండా ఇత‌రులు ఎవ‌రైనా గెలుస్తారా ? లేదా టీఆర్ఎస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేసుకుపోతుందా అనే విష‌యం తెలియాలంటే ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు ఎదురుచూడాల్సి ఉంటుంది. 

ఇక, అధికార టీఆర్‌ఎస్ పార్టీ రెబల్స్ బెడద ఉండటంతో ఓటర్లు క్యాంప్‌లకు తరలించారు. వారు క్యాంప్‌ల నుంచి నేరుగా పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఓటర్లు ఇతర అభ్యర్థులు వలలో పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఖమ్మం‌, మెదక్‌ జిల్లా‌ల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపిన కాంగ్రెస్ పార్టీ.. వారి ఓటర్లకు క్యాంప్‌లను ఏర్పాటు చేసింది.