హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెసు పార్టీలో చిచ్చు రేగుతోంది. మల్కాజిగిరి ఎఁపీ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించునున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు కొందరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ రెడ్డిపైనే కాకుండా కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీద కూడా ఆయన నిప్పులు చెరిగారు. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా సీనయర్ నాయకుడు మల్లు రవి స్పందించారు. 

Also Read: నేనేం దాచుకోలేదు, రేవంత్ రెడ్డి పేరు చెప్పా: విహెచ్ కు మల్లు రవి కౌంటర్

అయితే, ఎమ్మెల్యే సీతక్కను కాంగ్రెసు పార్టీ నాయకత్వం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించినప్పుడు తనను పిలువకపోవపడం బాధ కలిగించిందని ఆమె అన్నారు. తన అభిప్రాయం తీసుకోలేదని ఆమె అన్నారు. 

సీతక్క రేవంత్ రెడ్డి వర్గానికి చెందడం వల్లనే ఆమెను నాయకులు విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలనే విషయంలో ఆమె మాట్లాడడానికి నిరాకరించారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని మాత్రమే అన్నారు నిజానికి, రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలనే అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ నాయకుల్లో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు ఇతర నేతలు పీసీసీ అధ్యక్ష పడవి కోసం ప్రయత్నాలు సాగించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా పీసీసీ పదవి ఆశించారు ఈ నేపథ్యంలో సీతక్కను సమావేశానికి పిలిస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్తారనే ఉద్దేశం అందరిలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. సీఎల్పీ నుంచి రేవంత్ రెడ్డి పేరు రావద్దనే ఉద్దేశంతోనే వారు ఆమెను ఆహ్వానించలేదని అంటున్నారు.