టీపీసీసీ ఎన్నికపై కాంగ్రెస్ లో చాలా రోజులుగా అంతర్గం యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పీసీసీ చీఫ్ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీకి ఆ పార్టీ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. 

పీసీసీ చీఫ్‌‌ ఎంపికపై కాంగ్రెస్‌లో జరుగుతున్న రగడ మరోసారి రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచనలో పడింది. దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి‌ ఇవ్వాలని హైకమాండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ లేఖను జగ్గారెడ్డి సోనియాగాంధీతో పాటు రాహుల్‌, ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌లకు కూడా రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతోనే రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్‌ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని  పేర్కొంటూ.. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. 

సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్‌ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్‌ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.