కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా (contract employees regularization) మగ్గిపోతున్న వారికి తెలంగాణ ఆర్థిక శాఖ (telangana finance department) మంగళవారం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అయితే 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ కోరింది.
80 వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు 11వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2016 ఫిబ్రవరి 26న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే రోజు అందుకు సంబంధించిన మెమో కూడా ఇచ్చింది. అయితే క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ పిటిషన్‌ను 2021 డిసెంబర్ 7న హైకోర్టు (telangana high court) కొట్టివేయడంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది.
ఇకపోతే.. ఉద్యోగాల భర్తీలో (employment notification) భాగంగా తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతించింది.
అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారులు -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చర్చించి మిగిలిన ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.
