ధాన్యం కొనుగోలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందని తెలంగాణ మంత్రులు చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ధాన్యం కొనుగోలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందని తెలంగాణ మంత్రులు చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటల వల్ల బాధపడ్డామని తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి‌ కేసీఆర్‌తో సమావేశమై.. పర్యటన విశేషాలను ఆయనకు వివరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. 

ఇక, ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడతామని చెప్పారు. యాసంగిలో పండించే ధాన్యం బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తుందన్నారు. రాష్ట్ర మంత్రులను పనివాళ్లుగా చూస్తే ధోరణి దుర్మార్గమైనది అన్నారు. తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచమంటూ ప్రజలను అవమానించారని తెలిపారు.

వినతిపత్రంలోని అంశాలను చూడకుండా.. తెలంగాణ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల అవగాహ రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదర్యాం కూడా కేంద్రానికి లేదు. వరి సాగు చేయమని రైతులను రెచ్చగొట్టినా బీజేపీ నేతలు.. ఇప్పుడేందుకు కేంద్రాన్ని అడగట్లేదు అని విమర్శించారు. 

ఏప్రిల్ 1 వరకు ప్రతి స్థాయిలో ధాన్యం కొనుగోలుపై సామూహిక తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపాలని కోరారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టుగా చెప్పారు. కేసీఆర్‌ ఉన్నంతకాలంగా తెలంగాణ రైతులకు రక్షణ కవచం ఉన్నట్టేనని అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.