తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేటీఆర్ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మాట్లాడారని చెప్పారు. ఏపీ నేతలు, మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుబట్టడం.. ఆ తర్వాత కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇవ్వడం జరిగాయి. అయితే తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేటీఆర్ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మాట్లాడారని చెప్పారు. ఏపీ నేతలు, మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌లో తాము ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తలసాని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్దినే కేటీఆర్ చెప్పారని అన్నారు. మమ్మల్ని ఏపీ ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నారా..? అని ఫైర్ అయ్యారు. తమ కంటే అద్భుతంగా ఏపీలో పాలన చేస్తే మంచిదేనని చెప్పారు. హైదరాబాద్‌లో జనరేటర్ వాడామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అనడం సరికాదన్నారు. ఇక్కడ కరెంట్ లేనప్పుడు ఫంక్షన్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ నేతలు ఎందుకు తొందరపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. కరోనా చికిత్స ఎవరు ఎక్కడ తీసుకున్నారో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు.

ఇక, శుక్రవారం కెడ్రాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. పక్కా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ‘‘నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు.. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. అక్కడ వాళ్లకు తోటలు, ఇళ్లు ఉన్నాయి. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. కేటీఆర్ గారు మీరొక పని చేయండని చెప్పారు. మీ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి.. పక్క రాష్ట్రాలకు పంపిచండి సారు అని చెప్పారు. 

ఎందుకండి అని అడిగితే.. సంక్రాంతికి వాళ్ల ఊరిలో నాలుగు రోజులు ఉన్నానని ఆయన చెప్పారు. కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి.. అన్యాయంగా, అధ్వాన్నంగా ఉందని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్న ట్టుగా ఉందని ఆయన చెప్పారు. మన్నోళ్లను అందరిని అక్కడికి పంపాలని.. అప్పుడు మన ప్రభుత్వం విలువ తెలసి వస్తుందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు.. నేను ఎక్కువ చెప్పినట్టుగా అనిపిస్తే.. మీరు కూడా పక్క రాష్ట్రాలకు పోయి రండి. నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు.. కానీ వాస్తవాలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు, ఏపీ మంత్రులు తప్పుబట్టారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు సమర్ధించారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో.. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ఒక కార్యక్రమంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.